తెలుగు వారి సౌభాగ్యానికి ప్రతీక మన సంక్రాంతి పండుగ !!


పచ్చని తోరణాలూ, పసుపు పచ్చని గడపలూ,ముత్యాల ముగ్గులూ,ముద్దులొలికే గొబ్బెమ్మలూ,పాడిపంటలూ,పందెం కోళ్ళూ,కొత్త జంటల సంతోషాలూ, బావా మరదళ్ళ ముచ్చట్లు అందరి గుండెల్లో ఆనందాల పరవళ్ళు ఇదే మన సంక్రాంతి పండగ ప్రత్యేకత...  భాగ్యాలనిచ్చే భోగి సరదాలనిచ్చే సంక్రాంతి అందరికీ ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ మీకూ మీ కుటుంబ సభ్యులకి భోగి మరియు సంక్రాంతి సుభాకాంక్షలు.

పండుగలు మన సాంప్రదాయానికి ప్రతీకలు. భారత దేశం లో జరుపుకునే ప్రతి పండుగ వెనుక ఒక పరమార్థం ఉంటుంది. కానీ మమ్మి డాడి సంస్క్రుతి కారణంగా మన పండగల్ని మర్చిపోతున్నాం. ఈ కాలం పిల్లలకి, పెద్దవాళ్ళకి అసలు మన పండగలు ఎన్ని ఉన్నాయో కూడా తెలీటంలేదు. 

పండుగలు మన జీవితాన్ని రంగులమయం చేస్తాయి. అలాంటి మన పండగల గురించి తెలుసుకోక పోవటం నిజంగా మన దురద్రుష్టం. ఇపుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇది సంక్రాంతి పండుగ సమయం కాబట్టి. ఇంకెందుకు ఆలశ్యం ఇక చదవండి. 


సంక్రాంతి పండగ అనగానే ఆంధ్ర దేశంలో బడి పిల్లలకి, ఆఫీసులకి శెలవులు ప్రకటిస్తారు. ఇక అప్పటినుండి పండగ సందడి మొదలవుతుంది. సంక్రాంతి నాలుగు రోజుల పండుగ.  భోగి,సంక్రాంతి,కనుమ,ముక్కనుమ ఈ నాలుగు రోజుల్లో భోగి మరియు సంక్రాంతికి ముఖ్య స్థానం ఉంది.

అందరూ ఇళ్ళని శుభ్రం చేసుకుని రంగురంగుల ముగ్గులతో అలంకరిస్తారు. కొత్త బట్టలు ,పిండి వంటలు బంధు మిత్రులతో అందరి ఇళ్ళూ కళకళలాడుతూ ఉంటాయి. 

ముత్యాల ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పేడతో చేసిన గొబ్బెమ్మలను గుమ్మడి పూలతో అలంకరించి ముగ్గు ల్లో  పెట్టి ఆడవాళ్ళంతా గొబ్బియళ్ళు ఆడుతారు.

డూ డూ బసవన్నలు తమ సన్నాయి నాదాలతో గంగిరెద్దులని ఆడిస్తారు. 

నారదుని వేషంలో ఉన్న హరిదాసులు పాటలు పాడుతూ ఇంటి ఇంటి గడప ముందూ నిలుచుని ఆశీర్వదిస్తూ వాళ్ళు ఇచ్చిన దానం తీసుకుని వెళ్తారు .


రేగిపళ్ళు,శెనగలు,పూలూ, చెరుకు ముక్కలూ వీటన్నిటినీ కలిపి 5 ఏళ్ళ లోపూ ఉన్న చిన్న పిల్లలమీద పోస్తూ  బోగిపళ్ళ పండగ చేస్తారు. దీనివల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం.

బొమ్మల కొలువులూ ,కోడి పందేలూ ,కొత్త అల్లుళ్ళూ, పట్టు పరికిణీలు, పిండి వంటలూ అబ్బో సంక్రాతి పండుగ అంటే ఇంక చెప్పక్కర్లేదు. 

ప్రతి యేడూ భోగి జనవరి 13,14 తేదీలలో సంక్రాంతి ముందు రోజు జరుపుకుంటారు. ఇది మన మొదటి పండుగ. ఇది పంటల పండుగ కాబట్టి తమ పంటలు బాగా పండాలని వర్షాలు బాగా కురిసి అందరికీ మంచి లాభాలు రావాలని రైతులు ఇంద్రదేవుడుకి పూజలు చేస్తారు. ఇంద్రుడికే ఎందుకు పూజ చేయాలి అంటే వర్షానికి అధిపతి ఇంద్రుడు కాబట్టి. ముఖ్యంగా కొత్త అల్లుళ్ళతో ఇళ్ళు కళకళలాడుతూ ఉంటాయి. 

సూర్యోదయం కాకముందే ఇంట్లో ఉన్న పాత వస్తువులని భోగి  మంటల్లో వేసి ఆ మంటల్లో వేడి నీళ్ళను కాసి ఇంటిల్లి పాదీ తలస్నానాలు చేస్తారు.  

సూర్య భగవానుడు ధనుర్రాశి నుండి మకరరాశి లోకి ప్రవేసించే సమయం కాబట్టి ఈ పండుగను మకర సంక్రాంతి అని కూడా అంటారు.  

కొత్త పంటలనుండి చేసిన బియ్యంతో చక్కెర పొంగలి చేసి దేవుడికి నైవేద్యం పెడతారు. ముత్తైదువులు పసుపు ముద్దతో చేసిన లక్ష్మి దేవిని పూజిస్తారు. పేరంటాళ్ళను పిలిచి తాంబూలం ఇచ్చి వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటారు. 

చనిపోయిన పెద్ద వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళ పేరుతో భోజనాలు పెడతారు. ఇలా చెయ్యటం వల్ల పెద్దవాళ్ళు ఏలోకంలో ఉన్నా తమని కాపాడుతూ ఉంటారని నమ్ముతారు. 


కనుమ పశువుల పండుగ. ఈ రోజున పాడి పసువులను చక్కగా అలంకరించి పశు పూజ చేస్తారు. ఇలా తమకు ఆదాయాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే పశువులకి పూజ చేస్తారు.   

ఇంత సేపూ మీరు చదివింది ఒకప్పటి సంక్రాంతి పండుగ గురించి. ఆధునీకరణ పుణ్యమా అని మన సాంప్రదాయాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఈ కాలంలో పండుగ అంటే శెలవు దొరికిందా ఉడతా భక్తిగా కాసేపు దణ్ణం పెట్టుకున్నామా హోటెల్ కి వెళ్ళి భోజనాలు చేశామా అంతే అన్నట్లు అయిపోయింది. 

ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మన సాంప్రదాయాలని గౌరవించి మన పండుగలని మన ఆచారాలతో సంతోషంగా జరుపుకోవాలని నా ఆకాంక్ష.. 

భాగ్యాలనిచ్చే భోగి సరదాలనిచ్చే సంక్రాంతి అందరికీ ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ మీకూ మీ కుటుంబ సభ్యులకి భోగి మరియు సంక్రాంతి సుభాకాంక్షలు.....




Article By Prasuna
-->