
డబ్బులు పొదుపు చెయ్యాలంటే ఆడవాళ్ళే. భర్త 100 రూపాయలు ఖర్చు పెట్టమని ఇస్తే ఖచ్చితంగా అందులో 80 రూపాయలు ఖర్చు చేసి 20 దాచేస్తారు. ఇలా దాచిన డబ్బుని పిల్లలకో లేక ఇంటికి సంబదించిన వస్తువులు కొనటానికో ఉపయోగిస్తారు. ఇలా ఆడవాళ్ళంతా పొదుపు చేసిన తమ డబ్బులతో ఏం చేశారో ఇక చదవండి.
మహిళలు తలచుకుంటే ఏదైనా సాధిస్తారు అనే విషయానికి పక్కా ఉదాహరణే ఈ పాఠశాల. చూడటానికి ఒక ప్యాలెస్ లాగ కనిపించే ఈ భవనాన్ని ఇది ప్యాలెస్ కాదు పాఠశాల అని చెబితే నమ్మటం కష్టమే. ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు గ్రామంలోని డ్వాక్ర మహిళలు ఈ ఘనతను సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
ఇది మామూలు కథ కాదు. సాదాసీదా మహిళల అసాధారణమైన కథ. దిగువ మద్య తరగతి ఆదాయ పరిమితి కలిగిన వీళ్ళు మేము తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని నిరూపించారు.చుట్టుపక్కల ఉన్న 10 ఊర్లలోని ఆడవాళ్ళని కలుపుకుని 2008 నుండి డబ్బులను పొదుపు చెయ్యటం ప్రారంభించిన వీళ్ళు అందరు గర్వించేలా ప్యాలెస్ నిర్మించారు. క్షమించండి ప్యాలెస్ కాదిది... పాఠశాల !!!
వీళ్ళు ఇలా ఆలోచించటానికి ముఖ్య కారణం ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు అధికంగా ఉండటమే. మనమే మన పిల్లలకి మంచి పాఠశాల కట్టిస్తే బాగుంటుంది అనే వీరి ఆలోచన అక్షరాలా 7 కోట్ల రూపాయలతో చెక్కున మెరిసే పాలిష్ బండలు,మంచి బెంచీలు, రంగురంగుల తరగతి గదులతో అంతర్జాతీయ ప్రమాణాలను తలదన్నే రీతిలో పాఠశాలను నిర్మించేలా చేసింది. రూపాయి రూపాయి దాచుకుని కట్టుకున్న ఈ పాఠశాల వాళ్ళమండలంతో పాటూ చుట్టుపక్కల మండలాలలో ఉన్న ఎంతో మంది పిల్లలకు విద్యను అందించబోతోంది.
ఈ పాఠశాలలో వాళ్ళకు సంబందించిన వారే విద్యను బోధిస్తారు. బడిని నడపటానికి సరిపడా ఫీజులను తక్కువ మొత్తంలో వసూలు చేసి పిల్లలకు మంచి విద్యను అందిస్తున్నారు. అంతే కాకుండా ఒక 40 మంది అనాధ పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. నర్సరీ నుండి పదవతరగతి వరకు మొత్తం ఇంగ్లీషు మీడియమే. పిల్లలని తీస్కెళ్ళటానికి సొంతంగా బస్సులు కూడా కొన్నారు. సొంతంగా ఒక బ్యాంకునే నడిపిస్తున్నారంటే వీళ్ళ పనితనం ఎలా ఉందో ఆలోచించండి.
Follow @timepasspopcorn